ఇంటర్వ్యూ: అల్లు అర్జున్ – అందరికీ ఫ్యాన్స్ ఉంటే.. నాకు ఆర్మీ ఉంది

ఇంటర్వ్యూ: అల్లు అర్జున్ – అందరికీ ఫ్యాన్స్ ఉంటే.. నాకు ఆర్మీ ఉంది

Published on Jan 11, 2020 12:28 AM IST

సంక్రాంతి చిత్రాలలో ఒకటైన అలవైకుంఠపురంలో ఈనెల 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. బన్నీ- త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. విడుదల తేదికి సమయం దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. కాగా నేడు అల్లు అర్జున్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ విశేషాలు మీ కోసం…

 

“సామజవరగమన” అనే సాంగ్ అసలు ఎలా పుట్టింది.?

దీనికి చిన్న హిస్టరీ ఉంది. (నవ్వుతూ) ఖాళీగా ఉన్న రోజుల్లో.. అంతే గత రెండేళ్లలో బ్యాండ్ కల్చర్ బాగా పెరిగింది. వీటికి నా భార్య చాలా సార్లు పిలిచేది,ఇన్ని సార్లు అడుగుతుందని ఓసారి వెళ్తే ఆ బ్యాండ్ కు అందరి నుంచి ముఖ్యంగా యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇలా ప్రతీ ఒక్కరు గుర్తుంచుకునేలా,పాడుకునేలా ఓ సాంగ్ ఉండాలనుకున్నాను, అప్పుడు అనుకోకుండా ఈ చిత్రంలో ఓ సీన్ కు లవ్ సాంగ్ పడాల్సిన సమయం వచ్చినపుడు థమన్ కూడా ఈ బ్యాండ్ కల్చర్ గురించి చెప్పాడు. ఎలాంటి సాంగ్ అయితే అందరికీ నచ్చుతుందో, అందరూ ఇష్టపడుతున్నారో ఆ టెంపోలో మనం కూడా అలా చేద్దాం అని. అలా త్రివిక్రమ్ గారు ఆ “సామజవరగమన” అనే లిరిక్ ను ఆయనే క్రియేట్ చేసి థమన్ తో ట్యూన్ చేసి నాకు వినిపించారు. అలా పుట్టింది ఈ సాంగ్.

 

ఈ సినిమా ప్రీ రిలీజ్ లో మీ నాన్న గారి గురించి చెప్తూ బాగా ఎమోషనల్ అయ్యారు. ఈ చిత్రానికి దానికి ఏమన్నా సంబంధం ఉందా?

ఈ సినిమా స్రిప్ట్ కు ఆ రోజు ఆ సందర్భానికి ఏ సంబంధం లేదు. నేను గంగోత్రి నుంచి దాదాపు 20 సినిమాలు చేశా. వాటిలో ఏడెనిమిది నా తండ్రితోనే చేసాను, అయితే మన కల్చర్ లో ఒక తెలీని మొహమాటం ఉంటుంది. మాములుగా ఏవన్నా మంచి సినిమాలు తీసినప్పుడు మా నాన్నతో ఒకరికొకరం మంచి సినిమా తీసాం అని చెప్పుకునేవాళ్ళం కానీ, నేనెప్పుడూ మా నాన్నకు థాంక్స్ చెప్పలేదు. ఆయన నాకు ఎన్నో లెక్కలేనన్ని చేసారు. ఏదన్నా మంచి సందర్భం వచ్చినప్పుడు చెప్దాం అనుకున్నాను కానీ, ఆ ఆరోజు అంత ఎమోషనల్ అవుతానని నేను కూడా అనుకోలేదు.

 

ఆడియో విజువల్ గా మంచి రెస్పాన్స్ వచ్చింది కదా. చిరుగారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది?

చిరంజీవిగారు ఇంకా సినిమా చూడలేదు. విడుదల రోజు మధ్యాహ్నం చూస్తారు అప్పుడు చెప్తారు. అలాగే ఈ సినిమాలో చిరంజీవిగారి పై కొన్ని హైలైట్స్ కూడా ఉన్నాయి. అవి మీరు రేపు రిలీజ్ అయ్యాక థియేటర్లో చూస్తారు.

 

ఈ సినిమాలో మీ ఎంటర్టైన్మెంట్ రోల్ ను బాగా ఎంజాయ్ చేస్తూ చేసారా? అంటే “హ్యాపీ”లోలా.?

మాములుగా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ రోల్స్ చెయ్యాలి అంటే చాలా సరదా మూడ్ లో ఉండాలి అండి. ఎక్కువ బరువు తీసుకోకూడదు. అంటే సీరియస్ గా ఉండి… షాట్ అనగానే వచ్చి సరదాగా చేసి వెళ్ళిపోతే ఆ షాట్ బాగా రాదు. అందుకే నేను కూడా అంత బరువు పెట్టుకోలేదు చాలా సరదాగానే చేశాను, నా రోల్ కూడా మంచి ఎంటర్టైనింగ్ గానే ఉంటుంది.

 

మీ నుంచి మళయాళం స్ట్రైట్ సినిమా వస్తుందా..?

ఖచ్చితంగా..నన్ను మళయాళ ఇండస్ట్రీ ప్రెస్ వారు అడిగినపుడు కూడా అదే చెప్పా, ఒకరిద్దరు మేకర్స్ వచ్చారు కానీ, ఎక్కడో ఇద్దరికీ స్క్రిప్ట్ పరంగా సెట్టవ్వట్లా. చేస్తే ఏదన్నా మంచి సినిమానే చెయ్యాలి లేదంటే మన తెలుగు పరువు కూడా పోతుంది (నవ్వుతూ).

 

అల వైకుంఠపురంలో కథను ఎంచుకోవడానికి కారణం..?

నేను చేసిన గత మూడు చిత్రాలు సరైనోడు, డి జే, నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా ఇలా చాలా సీరియస్ కంటెంట్ కలిగినవి. అందుకే ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్స్ కలిగిన చిత్రం ఒకటి చేయాలనుకున్నాను. అందుకే అల వైకుంఠపురంలో చిత్రాన్ని ఎంచుకున్నాను.

 

త్రివిక్రమ్ తో ఎక్కువగా చిత్రాలు చేస్తున్నారు కారణం?

కొందరు హీరోలు దర్శకుల మధ్య ఒక రిధం కుదురుతుంది. ఉదారణకు చెప్పాలంటే చిరంజీవి కోదండ రామిరెడ్డి కలిసి అప్పట్లో అనేక హిట్ మూవీస్ రూపొందించారు. అలాగే త్రివిక్రమ్ గారికి నాకు మధ్య మంచి రిధం కుదిరింది.

 

టైటిల్ అల వైకుంఠపురంలో అని పెట్టడానికి కారణం ఏమిటీ?

ఈ సినిమా వైకుంఠపురం అనే ఇంటిలోని సభ్యుల మధ్య నడుస్తుంది. అందుకే అల వైకుంఠపురంలో అని టైటిల్ పెట్టాము.

 

ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?

నేను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపిస్తాను. పూజా హెగ్డే నా బాస్ గా కనిపిస్తారు. ఇక నా ఫాదర్ గా చేసిన మురళి శర్మ గారికి నాకు అస్సలు పడదు.

 

చాలా గ్యాప్ వచ్చింది..మరి ఈ గ్యాప్ లో ఏమీ చేశారు?

ఈ గ్యాప్ చాలా విషయాలు నేర్పింది. ఏమి చేయాలి.. ఏమి చేయకూడదు అనే, అనేక విషయాలు తెలుసుకున్నాను. ఐతే నేను ఇంత పెద్ద విరామం తీసుకున్నా, నా ఫ్యాన్స్ నన్ను ఎప్పుడూ ఫాలో అవుతూ… ప్రతి విషయంలో సపోర్ట్ చేశారు. అందుకే అందరికీ ఫ్యాన్స్ ఉంటే నాకు ఆర్మీ ఉంది అని అన్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు