విడుదల తేదీ : ఆగస్టు 11, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: చిరంజీవి, తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, ఉత్తేజ్
దర్శకుడు : మెహర్ రమేష్
నిర్మాతలు: రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర, అజయ్ సుంకర
సంగీతం: మహతి స్వర సాగర్
సినిమాటోగ్రఫీ: డడ్లీ
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
సంబంధిత లింక్స్: ట్రైలర్
మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం భోళా శంకర్. కాగా ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులును ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
శంకర్ (చిరంజీవి) తన చెల్లి మహాలక్ష్మి (కీర్తి సురేష్)తో కలిసి కోలకతాకి వస్తాడు. బ్రతుకుతెరువు కోసం టాక్సీ నడుపుతూ ఉంటాడు. అయితే, సిటీలో ఓ మాఫియా గ్యాంగ్ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేసి అమ్మెస్తూ ఉంటారు. వారిని పట్టుకోలేక పోలీసులు సతమతమవుతూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో శంకర్ (చిరంజీవి) ఆ మాఫియాని టార్గెట్ చేస్తాడు. అసలు శంకర్ ఆ మాఫియాని ఎందుకు టార్గెట్ చేశాడు?, గతంలో ఆ మాఫియాతో శంకర్ కి ఉన్న సంబంధం ఏమిటి ?, ఈ మధ్యలో లాయర్ లాస్య(తమన్నా)తో శంకర్ ట్రాక్ ఏమిటి ?, చివరకు శంకర్ ఆ మాఫియాని అంతం చేశాడా ?, లేదా ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో మరియు మెగా ఎంటర్ టైన్మెంట్ తో అలాగే బరువైన ఎమోషన్స్ తో వచ్చిన ఈ భోళా శంకర్ ఓన్లీ కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే ఆకట్టుకున్నాయి. ఐతే, సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ తో పాటు కథలోని మెయిన్ కోర్ ఎమోషన్ కూడా బాగుంది. అలాగే మెగాస్టార్ పాత్రలోని షేడ్స్ ను, తమన్నాతో సాగే సీన్స్ ను మరియు ప్లాష్ బ్యాక్ ను.. ఆ ప్లాష్ బ్యాక్ లోని ఎమోషనల్ సీక్వెన్సెస్ సినిమాకి ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా మెగాస్టార్ పాత్రలోని ఎలివేషన్ సన్నివేశాలు విశేషంగా అలరిస్తాయి.
చిరు కూడా రఫ్ అండ్ మాస్ అవతార్ లో మెగాస్టార్ అద్భుతంగా నటించారు. ఇక చెల్లి పాత్రకు కీర్తి సురేష్ ప్రాణం పోశారు. మరో అతిధి క్యారెక్టర్ లో సుశాంత్ కూడా బాగానే నటించాడు. తమన్నా గ్లామర్ ఆకట్టుకుంది. కీలక పాత్రలో నటించిన మురళీశర్మ పెర్ఫార్మెన్స్ చాలా సెటిల్డ్ గా చాలా బాగుంది. శ్రీముఖి కి చెప్పుకోతగ్గ క్యారెక్టర్ పడింది. ఆమె అందంతో పాటు నటన కూడా మెప్పించింది. రఘు బాబు, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్ :
శంకర్ – మహాలక్ష్మి పాత్రలు, కథా నేపథ్యం, అలాగే ఇతర పాత్రల చిత్రీకరణ, నటీనటుల పనితీరు బాగున్నా.. కథనం విషయంలో మెహర్ రమేష్ చాలా స్లోగా ప్లేను నడిపాడు. అయితే, సెకెండ్ హాఫ్ లో పాత్రల మధ్య ఎమోషన్స్ ను బాగా ఎస్టాబ్లిష్ చేసినా… కొన్ని చోట్ల మెలో డ్రామాలా అనిపిస్తోంది. దీనికి తోడు పాత్రలు ఎక్కువ అవ్వడం, అలాగే అక్కడక్కడా కామెడీ కోసం పెట్టిన అనవసరమైన డిస్కషన్ సినిమా స్థాయికి తగ్గట్టు లేదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వెన్నెల కిషోర్ తో సాగిన కామెడీ సీన్స్ సరిగ్గా వర్కౌట్ కాలేదు.
ఇక సెకండాఫ్ లో కూడా కొన్ని చోట్ల ప్లే స్లోగా సాగింది. ప్రధానంగా కొన్ని లీడ్ సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. దీనికితోడు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా రొటీన్ గానే సాగాయి. విలన్స్ – హీరో మధ్య కాన్ ఫ్లిక్ట్ కూడా ఇంకా బలంగా ఉండాల్సింది. మొత్తమ్మీద దర్శకుడు మెహర్ రమేష్ పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఈ భోళా శంకర్ ను మలచలేకపోయారు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. ముందే చెప్పుకున్నట్లు దర్శకుడు మెహర్ రమేష్ టేకింగ్ బాగుంది. అయితే, మంచి కంటెంట్ రాసుకోవడంలో విఫలం అయ్యారు. ఆయన రాసిన స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా లేదు. సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ అందించిన సంగీతం పర్వాలేదు. ఐతే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని కీలక సన్నివేశాల్లో ఆకట్టుకునేలా ఉంది. డడ్లీ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఇక ఎడిటర్ ఎడిటింగ్ వర్క్ కూడా పర్వాలేదు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
తీర్పు :
భోళా శంకర్ అంటూ వచ్చిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా కొన్ని చోట్ల మాత్రమే ఆకట్టుకుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గ్రేస్ అండ్ ఇమేజ్ సినిమాకి ప్లస్ అయ్యాయి. కానీ, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ కావడం, కొన్ని చోట్ల స్లో నేరేషన్, మరియు బోరింగ్ సీన్స్, రెగ్యులర్ సన్నివేశాలు వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో మెగాస్టార్ నటన, కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నా.. సినిమా మాత్రం మెప్పించలేకపోయింది. ఐతే, మెగా ఫ్యాన్స్ ఓసారి చూడొచ్చు.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team