లాక్ డౌన్ రివ్యూ : ‘మేక సూరి’ ( జీ5లో ప్రసారం)

లాక్ డౌన్ రివ్యూ : ‘మేక సూరి’ ( జీ5లో ప్రసారం)

Published on Jul 31, 2020 9:07 PM IST
Uma Maheswara Ugra Roopasya Review

Release date : July 31st, 2020

123telugu.com Rating : 2.75/5

నటీనటులు : అభినయ్, సమయ తదితరులు

దర్శకుడు : త్రినాధ్ వెలిశిల

నిర్మాత : కార్తీక్ కంచెర్ల

రచన : త్రినాధ్ వెలిశిల

 

దర్శకుడు త్రినాధ్ వెలిశిల దర్శకత్వంలో ‘‘క్రైమ్‌ జానర్‌లో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‌ ‘మేక సూరి’. థియేటర్‌ ఆర్టిస్టులు సుమయ, అభినయ్‌ను నటీనటులుగా పరిచయం చేస్తూ.. కార్తీక్ కంచెర్ల సింబా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమా ‘జీ5’లో అందుబాటులో ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

 

కథ :

సూరి(అభినయ్‌)ది మేక తోలు వలిచి, మాంసం కొట్టే వృత్తి. అవలీలగా నిమిషాల్లో మేక తోలు వలిచి ముక్కలు కొట్టే అలవాటు ఉండటంతో అతనికి ‘మేక సూరి’ అనే పేరు వస్తోంది. అదే ఊరిలోని పెద్దమనిషి అప్పలనాయుడు దగ్గర పనిచేసే రాణి(సుమయ)ని ప్రేమిస్తాడు. రాణి కూడా సూరిని ప్రేమిస్తోంది. అయితే ఆ ఊరి పెద్ద అప్పలనాయుడుతో పాటు మిగిలిన వాళ్లల్లో చాలామంది కన్ను రాణి మీదే ఉంటుంది. కానీ రాణి తను ప్రేమించిన సూరిని పెళ్లి చేసుకుంటుంది. అయితే రాణి కొన్ని కారణాల వల్ల అప్పలనాయుడుతో శారీరక సంబంధం పెట్టుకుంటుంది. ఆ విషయంలో రాణికి సూరికి మధ్య గొడవ జరుగుతుంది. ఈ క్రమంలో రాణి ఓ రోజు హత్యకు గురవుతుంది. రాణిని సూరి చంపేసాడని అరెస్ట్ చేస్తారు. ఇంతకీ రాణిని చంపింది ఎవరు? అందుకు కారణమైన వ్యక్తుల పై సూరి ఎలా పగతీర్చుకున్నాడు ? ఈ కేసులో వీరభద్రం యస్.ఐ పాత్ర ఏమిటి ? అసలు ఎందుకు రాణి అప్పలనాయుడుతో అక్రమ సంబంధం పెట్టుకోవాల్సి వచ్చింది ? నిజంగానే సంబంధం ఉందా ? లేదా ? చివరకు సూరి ఏమైపోయాడు ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో హీరోగా నటించిన అభినయ్ తన పాత్రకు తగ్గట్లు… తన లుక్స్ అండ్ ఫిజిక్ బాగా మెయింటైన్ చేశాడు. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. ముఖ్యంగా హీరోయిన్ చనిపోయిన సన్నివేశంలో అలాగే పిచ్చోడిలా కనిపించే సన్నివేశంలో గాని, ప్రీ క్లైమాక్స్ లో గాని అభినయ్ చాలా బాగా నటించాడు. ఇక హీరోయిన్ గా నటించిన సమయ హీరోయిన్ మెటీరియల్ కాకపోయినా కొన్ని లవ్ సీన్స్ లో అవలీలగా నటించడంతో పాటు నేటివిటీకి తగ్గట్టు నేచురల్ గా కనిపిస్తూ ఆకట్టుకుంది. ఇక ఈ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ లో బలహీనమైన పాత్రలతో కొన్ని భావోద్వేగ సన్నివేశాలను పండించడానికి దర్శకుడు త్రినాధ్ వెలిశిల బాగానే ప్రయత్నించాడు. ముఖ్యంగా నేటివిటీకి తగిన సీన్స్ ను తెరకెక్కించడంలో అతను సక్సెస్ అయ్యాడు.విలన్ అప్పలనాయుడు పాత్రలో నటించిన నటుడు కూడా బాగా నటించాడు. ఆయన పలికిన మాటలు కొన్ని బాగానే అలరించాయి. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. ముఖ్యంగా యస్.ఐ వీరభద్రంగా నటించిన నటుడు వైల్డ్ యాక్టింగ్ సినిమాకి బాగా ప్లస్ అయింది.

 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు రాసుకున్న కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. సినిమాలో మరీ అవసరానికి మించి వైలెన్స్ ఎక్కువైపోయింది. ఏ సీన్ కి ఆ సీన్ బాగుంది అనిపించినా, ఓవరాల్ గా కథలో మిళితమయ్యి ఒక ప్లోలో సాగవు. ప్లే ప్రకారం సీన్స్ వచ్చాయి అనుకున్నా.. సడెన్ గా మధ్యలో వచ్చిన ఆ సీన్స్ లో మ్యాటర్ ఉంటేనే అవి ఎఫెక్టివ్ గా అనిపిస్తాయి. కానీ ఏదో మ్యాటర్ ఆఫ్ ఫాక్ట్ సీన్స్ కోసం సీన్స్ రాసుకోకుండా ఉండాల్సింది.ఇక కొన్ని సీన్స్ సరిగ్గా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వవు. దర్శకుడు సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తరువాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశాడు. మొత్తానికి ఈ రెగ్యులర్ రివేంజ్ స్టోరీలో కొన్ని భావోద్వేగ సన్నివేశాలను పండించడానికి దర్శకుడు కథనంలో అనవసరమైన సీన్స్ పెట్టకుండా ఉండాల్సింది.లవ్ అండ్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో.. ప్రేక్షకులను ఇటు పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచే లవ్ ఉండదు, అటు పూర్తిగా ఆకట్టుకునే యాక్షన్ ఉండదు. ఓవరాల్ గా అవసరానికి మించి యాక్షన్ సన్నివేశాలు ఎక్కువైపోవడం, కథ కథనాలు ఆకట్టుకోకపోవడంతో సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు.
 

సాంకేతిక విభాగం:

సినిమాలో దర్శకుడు చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో అండ్ ఇంట్రస్ట్ తో సాగకపోవడం దీనికి తోడు మోతాదుకి మించి హింసాత్మక సన్నివేశాలను వైల్డ్ గా తెరకెక్కించడం వల్ల దర్శకుడి పనితనం పర్వాలేదు దగ్గరే ఆగిపోయింది. ఇక సంగీత దర్శకుడు సమకూర్చున పాటలు పర్వాలేదనిపిస్తాయి. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీనే హైలెట్ గా నిలుస్తోంది. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకోగా.. కెమెరామెన్ వాటిని తెరకెక్కించిన విధానం కూడా చాల బాగుంది. ఎడిటింగ్ బాగున్నప్పటికీ, సినిమాలో కథకు అవసరం లేకుండా వచ్చే కొన్ని సీన్స్ ను ట్రిమ్ చేసి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. ఈ చిత్ర నిర్మాత కార్తీక్ పాటించిన నిర్మాణ విలువులు బాగున్నాయి.

 

తీర్పు:

నూతన దర్శకుడు త్రినాధ్ వెలిశిల దర్శకత్వంలో ఈ క్రైమ్ రివేంజ్ యాక్షన్ డ్రామా పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా తెరకెక్కలేదు. పైగా డీసెంట్ అండ్ ఫ్యామిలీ సినిమాల ప్రేక్షకులను నిరుత్సాహ పరుస్తోంది. అయితే కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు కొన్ని భావోద్వేగ సన్నివేశాలతో దర్శకుడు అక్కడక్కడా ఆకట్టుకున్నాడు. కానీ కథకథనాల విషయంలో అతను ఇంకా బాగా రాసుకోవాల్సింది. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులు అభినయ్, సమయ తమ నటనతో ఆకట్టుకున్నారు. మొత్తం మీద యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ చిత్రంలోని కొన్ని అంశాలు నచ్చుతాయి. కానీ మిగిలిన వర్గాల ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా ఆకట్టుకోదు.

123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు