ఇంటర్వ్యూ : విష్ణు వర్ధన్ – ఎన్టీఆర్ బయోపిక్ ఒక ఖరీదైన గుణపాఠం

ఇంటర్వ్యూ : విష్ణు వర్ధన్ – ఎన్టీఆర్ బయోపిక్ ఒక ఖరీదైన గుణపాఠం

Published on Sep 5, 2019 4:19 PM IST

ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు వంటి చిత్రాలు నిర్మించిన నిర్మాత విష్ణు వర్ధన్, రణ్వీర్ సింగ్ తో కపిల్ దేవ్ బయో పిక్ 83 నిర్మిస్తున్నారు. అలాగే కంగనా రనౌత్ హీరోయిన్ గా జయలలిత బయో పిక్ తెరకెక్కించనున్నాడు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో ఈమూడు బయోపిక్ ల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

 

83 మూవీకి నిర్మాతగా ఉన్నారు, ఆ చిత్ర విశేషాలు చెవుతారా?

83 మూవీ ఎక్కువభాగం లండన్ లో చిత్రీకరించడం జరిగింది. దాదాపు 100 రోజులు అక్కడ చిత్రీకరించాము. ఇంకా మిగిలిన 20 శాతం షూటింగ్ ఇండియాలో జరపనున్నాము. అలాగే ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు మరియు తమిళ భాషలలో భారీగా విడుదల చేయనున్నాము.

 

83 చిత్రాన్ని నిర్మించడానికి కారణం?

మనం భారత స్వాతంత్య్రం గురించి చెప్పుకున్నట్లే, ఖచ్చితంగా 83 వరల్డ్ కప్ గురించి చెప్పుకోవాలి. ఈరోజు ఇండియాలో క్రికెట్ కి ఇంత ఆదరణ ఉందంటే అది కేవలం 83లో వరల్డ్ కప్ గెలిచిన టీం సభ్యుల వలనే. రోజుకు కేవలం 200 వేతనం తీసుకుంటూ వారు దేశానికి వరల్డ్ కప్ అందించారు. ఈ ప్రయాణంలో వారు అనుభవించిన కష్టాలు, బాధలు నాకు స్ఫూర్తి కలిగించాయి. అందుకే ఈ చిత్రం నిర్మిస్తున్నాను.

 

83 మూవీ ఐడియా ఎవరిది ?

నేను నిర్మాతగా వ్యవహరించే ప్రతి సినిమా ఆలోచన నాదే అవుతుంది. 83మూవీ చేయాలని నాకు అనిపించి మిగతా వారిని కలవడం జరిగింది. అలాగే ఎన్టీఆర్, జయలలిత ల బయోపిక్ చేయాలన్న ఐడియా నాదే, అందుకే వాటికి నేను నిర్మాతగా మారాను. అలా అని కేవలం నా ఆలోచనలే సినిమాలు చేస్తానని కాదు, కొత్త ఐడియాలతో వేరే వారు వచ్చినా మూవీ నిర్మించడానికి సిద్ధం.

 

ఎన్టీఆర్ మూవీ ఫలితం పై మీ స్పందన ఏమిటీ?

ఎన్టీఆర్ చిత్రం నిర్మించినందుకు నేను గర్వంగా ఫీలవుతున్నాను. కానీ ఆ చిత్రం మా అంచనాలు అందుకోక పోవడానికి అనేక కారణాలున్నాయి. ప్రేక్షకులు ఆశించిన ఏదో కీ పాయింట్ మేము మిస్సయ్యామనిపించింది. మహాభారత, గాంధీ జీవిత గాధ కూడా ఒక పార్ట్ లో చెప్పగలిగినప్పుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర కూడా ఒక పార్ట్ లో చెప్పివుండాల్సింది. ఎన్టీఆర్ చిత్రం ఒక భాగంగా వచ్చినట్లైతే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేది అనిపించింది. ఎన్టీఆర్ బయో పిక్ ఒక ఖరీదైన గుణపాఠం నేర్పింది.

 

జయలలిత బయో పిక్ చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుంది?

జయలలిత బయోపిక్ అక్టోబర్ 15నుండి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. విజయేంద్ర ప్రసాద్ గారు స్టోరీ రాస్తున్నారు. కంగనా రనౌత్ జయలలిత పాత్ర చేస్తున్నారు. దీనిని కూడా హిందీ,తెలుగు మరియు తమిళ, మలయాళ భాషలలో విడుదల చేయనున్నాము. వచ్చే ఏడాది మేలో విడుదలయ్యే అవకాశం కలదు.

 

కంగనా జయలలిత పాత్ర కోసం ఎలా సిద్ధం అవుతున్నారు?

కంగనా జయలలిత పాత్ర కోసం డాన్స్ కూడా నేర్చుకుంటున్నారు. అలాగే ఆమె మేక్ ఓవర్ కోసం హాలీవుడ్ నుండి నిపుణులను పిలిపించాము. కంగనా అచ్చమ్ జయలలితలా కనిపించడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

 

జయలలిత జీవితంలోని ఏకోణం చూపించబోతున్నారు?

ఆమె జీవితంలోని ముఖ్య ఘట్టాలైన చైల్డ్ హుడ్ లైఫ్ నుండి, నటిగా ఎదిగిన తీరు, అలాగే ప్రేమ, ఆప్యాయతలు, అన్ని చూపించబోతున్నాం. ఆమె ఎన్ని ఒడిడుకులు, అవమానాలు ఎదుర్కొన్నారు. సీఎం ఎలా అయ్యారు అనేది మా చిత్రంలో ఉంటుంది.

 

ఆమె జీవితంలో కొన్ని వివాదాలు ఉన్నాయి, అవికూడా చూపిస్తారా?

ఖచ్చితంగా …,ఆమె మొదటిసారి ముఖ్యమంత్రి అయినంత వరకు మా మూవీ ఉంటుంది. అప్పటివరకు ఆమె జీవితంలోని ప్రతి ముఖ్యమైన సంఘటన మా చిత్రంలో ఉంటుంది.

 

టైటిల్ తలైవి అని అంటున్నారు నిజమేనా?

టైటిల్ ఇంకా నిర్ణయించలేదు. తలైవి అనేది కేవలం వర్కింగ్ టైటిల్ గా ఉంది. జయ అనే టైటిల్ కూడా ఒకటి పరిగణలో ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు