ఇంటర్వ్యూ : వరుణ్- చిరంజీవి బయోపిక్ ఆయన చేయకుంటే నేను చేస్తా…!

ఇంటర్వ్యూ : వరుణ్- చిరంజీవి బయోపిక్ ఆయన చేయకుంటే నేను చేస్తా…!

Published on Sep 18, 2019 1:38 PM IST

వరుణ్ తేజ్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వాల్మీకి. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపి చంద్ ఆచంట నిర్మించిన ఈ చిత్రం ఈనెల 20న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరో వరుణ్ పాత్రికేయుల సమావేశంలో పాల్గొని, చిత్ర వేషాలు పంచుకున్నారు.

 

వాల్మీకి చిత్రం ఎలా కార్యరూపం దాల్చింది?

హరీష్ గారు నాదగ్గరకు ఓ లవ్ స్టోరీ స్క్రిప్ట్ తో రావడం జరిగింది. ఫిదా, తొలిప్రేమ వంటి చిత్రాల తరువాత నేను ఓ డిఫరెంట్ జోనర్ లో చేద్దాం అని అనుకుంటున్నాను, అని నేను ఆయనకు చెప్పడంతో జిగర్తాండ మూవీ చూశావా అని అడిగారు. అప్పుడు నేను చేశాను అని చెప్పడం జరిగింది. ఇక ఆ తరవాత ఆ మూవీకి సంబందించిన స్క్రిప్ట్ ఆయన నాకు చెప్పడం నేను ఒకే చేయడం జరిగింది.

 

జిగర్తాండకు వాల్మీకి మధ్య వ్యత్యాసం ఉంటుందా?

 

ఒరిజినల్ చిత్రానికి 50% వరకు మార్పులు చేయడం జరిగింది. గద్దలకొండ గణేష్ పాత్ర ఎలివేషన్ కొరకు పూజా పాత్రను కలపడంతో పాటు, గద్దలకొండ గణేష్ గా మారడానికి గల కారణమేమిటి అన్న విషయాన్ని చెప్పేలా ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొత్తగా వాల్మీకి కి చేర్చడం జరిగింది. ఇక మిగతా అంతా చాలా వరకు జిగర్తాండను అనుసరించి తీయడం జరిగింది.

 

హీరోగా ఉన్న మీరు విలన్ షేడ్ లో ఉన్న పాత్ర చేయడం రిస్క్ అనిపించలేదా?

ఈ విషయం తెలిసిన చాలా మంది సన్నిహితులు కూడా ఇలాగే రిస్క్ చేస్తున్నావ్, వద్దంటూ వారించారు. కానీ నేను కథను నమ్మాను. సరే… చిరంజీవి గారి సలహా తీసుకుందాం అని ఆయనని అడుగగా, కథ చాలా బాగుంది అన్నారు.

 

తెలంగాణా యాస కోసం ఎలా సిద్ధమయ్యారు.

ఈ చిత్రంలో నాపాత్ర గద్దలకొండ గణేష్ తెలంగాణా యాసలో మాట్లాడాలి. ఈ విషయంలో దర్శకుడు హరీష్ శంకర్ నాకు చాలా సహాయపడ్డారు. ఆయన సెట్స్ లో ప్రతి డైలాగ్ ఎలా చెప్పాలి అనేది నాకు స్పష్టంగా వివరించేవారు. నేను కూడా సీన్ కి ముందురోజు చాలా కసరత్తు చేశేవాడిని.

 

ఈమూవీ చేయడానికి గల కారణమేమిటి?

ముఖ్యంగా కథ.., అలాగే హీరో ఎందుకు మంచివాడే కావాలి, అన్న విధంగా ఈ చిత్రంలో పాత్రను తీర్చిదిద్దడం జరిగింది. నా గత చిత్రాల వలే గ్లామర్ గా ఉండాలి, జుట్టు దువ్వుకోవాలి, మేకప్ వేసుకోవాలి అని ఉండదు. ఈ చిత్రంలో మీకు వరుణ్ కనిపించదు, కేవలం గద్దలకొండ గణేష్ మాత్రమే కనిపిస్తాడు.

 

ఒరిజినల్ చిత్రంలో నటించిన బాబీ సింహని ఇమిటేట్ చేశారా?

ఇమిటేట్ చేస్తే పాత్రలో సహజత్వం పోతుంది. అలాగే కొత్తగా ఏమి అనిపించదు. కాకపోతే ఎంతో కొంత ఆయన తాలూకు ప్రేరణ మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అంత అద్భుతంగా నటించారు. ఆయనకు జాతీయ అవార్డు కూడా రావడం జరిగింది. చాలా వరకు నా పద్దతిలో నేను నటించాను.

 

ఆల్రెడీ తెలుగులో కూడా డబ్బింగ్ ఐయ్యింది కదా ఈ చిత్రం ?

అవును, తెలుగులో కూడా ఈ చిత్రం వచ్చింది. కానీ చాలా మంది తెలుగు ప్రేక్షకులు ఆ చిత్రం చూడలేదు. అందుకే మేము అంత మంచి కథ అందరికి చేరేలా చేయాలనీ వాల్మీకి తీయడం జరిగింది.

 

నిర్మాతల గురించి మీ అభిప్రాయం ?

14రీల్స్ బ్యానర్ లో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమాపై ఫ్యాషన్ తో నిర్మాణంలోకి అడుగుపెట్టినవారు ఈ చిత్ర నిర్మాతలు. గత రెండేళ్లుగా ఈ బ్యానర్ లో మూవీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది వాల్మీకి చిత్రంతో సాధ్యం ఐయ్యింది.

 

అంతరిక్షం మూవీ ఫలితం పై మీ స్పందన ఏమిటీ?

అంతరిక్షం మూవీ కథకి మేకింగ్ సమయంలోనే న్యాయం చేయలేకపోయాం. అంటే బడ్జెట్ పరిమితుల రీత్యా దానిని అనుకున్న స్థాయిలో తెరకెక్కించలేకపోయాం. అందుకే ఆ చిత్రం ఆశించినంతగా ఫలితం సాధించలేదు.

 

హీరోయిన్ పూజా గురించి చెప్పండి?

నాలుగేళ్ల క్రితం నా మొదటి చిత్రం ముకుందా చిత్రంలో చేసింది ఆమె. ఇప్పుడు మళ్ళీ కలిసిచేస్తున్నాం. ఈ నాలుగేళ్ళలో ఆమె నటన పరంగా ఆమెలో చాలా మెట్యూరిటి రావడం జరిగింది. ఈ మూవీలో దేవిగా ఆమె తన పాత్రకు 100శాతం న్యాయం చేసింది.

 

చిరంజీవి బయోపిక్ హరీష్ చేస్తాను అంటున్నారు, అందులో మీరే నటిస్తారా?

హరీష్ నాతో చేస్తానని చెప్పలేదు. ఐనా చిరంజీవి బయోపిక్ అన్నయ్య చరణ్ చేస్తేనే బాగుంటుంది. ఒకవేళ ఆయన చేయకపోతే నేను చేస్తాను.

 

మీ భవిష్యత్ చిత్రాల గురించి చెప్పండి?

బాక్సింగ్ నేపథ్యంలో ఓ మూవీ రానుంది. అలాగే మూడు – స్క్రిప్ట్స్ విన్నాను, చర్చల దశలో ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు