సమీక్ష : క్లైమాక్స్ – క్లైమాక్స్ మాత్రమే బాగుంది

సమీక్ష : క్లైమాక్స్ – క్లైమాక్స్ మాత్రమే బాగుంది

Published on Mar 6, 2021 3:03 AM IST
 Climax movie review

విడుదల తేదీ : మార్చి 05, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.5/5

నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, సాషా సింగ్, శ్రీరెడ్డి, పృథ్వీ రాజ్, శివ శంకర్ మాస్టర్

దర్శకత్వం : భవాని శంకర్

నిర్మాత‌లు : రాజేశ్వర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి

సంగీతం : రాజేశ్ నిద్వాన

సినిమాటోగ్రఫీ : రవి కుమార్ నీర్ల

ఎడిటింగ్ : బస్వ పైడిరెడ్డి

 

సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ చాలా కాలం తరువాత ఈ “క్లైమాక్స్” థ్రిల్లర్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. మందపాటి, పొడవాటి బూడిదరంగు జుట్టు మరియు గుబురు గడ్డంతో, బాడీ మీద టాటూలతో విజయ్ మోడీ అనే అతని పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఆయన క్రేజీ గెటప్ ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచింది. మరీ ఈ థ్రిల్లర్ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి.

 

కథ:

విజయ్ మోదీ (రాజేంద్ర ప్రసాద్) ఒక ధనవంతుడు. అతనికి ఇద్దరు భార్యలు, వారికి ఇద్దరు పిల్లలు. వయసు పైబడినా అతనికి అమ్మాయిల మీద కాస్త ఆసక్తి ఉండేది. వ్యాపార వేత్తగా కోట్లు గడించినా ఏదో లోటు అతనిలో కనిపించేది. అయితే పేరు ప్రఖ్యాతలు సంపాదించేందుకు రియల్ ఎస్టేట్ రంగంలోకి, సినిమా నిర్మాణంలోకి అడుగుపెడతాడు. ఈ ప్రక్రియలో అతను ఓ రాష్ట్ర మంత్రికి బినామిగా మారుతాడు. దీంతో ఆయన చాలా మంది స్నేహితులను సంపాదించుకోగా, అదే స్థాయిలో శత్రువులను కూడా కొనితెచ్చుకున్నాడు.

అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అతను ఇంటిని వదిలి తన స్టార్ హోటల్‌లోనే గడుపుతుంటాడు. ఓ రాత్రి విజయ్ మోదీ హత్యకు గురవుతాడు. అయితే విజయ్ మోదీనీ ఎందుకు చంపారు? ఆ అవసరం ఎవరికి ఉంది? పోలీసులు ఈ ముర్డర్ మిస్టరీనీ ఎలా చేధించారు? అసలు క్లైమాక్స్ అనే టైటిల్ ఈ చిత్రానికి ఎందుకు పెట్టారు? అనేవి పూర్తిగా తెలియాలి అంటే ఈ క్లైమాక్స్ థ్రిల్లర్‌ను వెండితెరపై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

బ్యాంకుల దగ్గర కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుని జల్సా చేసే వ్యాపారవేత్తగా విజయ్ మోదీ (రాజేంద్ర ప్రసాద్) తన క్రేజీ గెటప్, బాడీ లాంగ్వేజ్ మరియు డైలాగ్‌లతో ప్రేక్షకులను బాగా మెప్పించారు. విజయ్ మొదీనీ మోహింపజేసే యువతిగా సాషా సింగ్ తెరపై చాలా కాన్‌ఫిడెంట్‌గా కనిపిస్తుంది. ఆమె ఓ సాంగ్‌లో మంచి గ్లామరస్‌గా కూడా కనిపిస్తుంది. ఇక శ్రీరెడ్డి, పృథ్వీరాజ్, శివశంకర్ మాస్టర్, రమేశ్ తదితరులు ప్రధాన పాత్రల్లో చక్కగా నటించగా, మిగతా కొత్త నటీనటులు కూడా పర్వాలేదనిపించారు.

ఇదిలా ఉంటే క్లైమాక్స్ ట్విస్ట్ టైటిల్‌ను సమర్థించడమే కాకుండా, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం చాలావరకు స్టార్ హోటల్ లోపల చిత్రీకరించబడింది కాబట్టి విజువల్స్ కూడా చాలా రిచ్ గా కనిపిస్తాయి. సినిమా మొదటి 20 నిమిషాల్లో విజయ్ మోదీ (రాజేంద్ర ప్రసాద్) హత్యకు గురవ్వడం చూపించడంతో అది ఆసక్తికరమైన థ్రిల్లర్‌గా సినిమాను నిలిపిందనే చెప్పాలి.

 

మైనస్ పాయింట్స్:

బలహీనమైన కథనంతో క్లైమాక్స్ కాస్త తగ్గిపోయింది. అసాధారణమైన నామమాత్రపు పాత్రలు కూడా అన్ని విధాలుగా ఉత్సుకతను పెంచుతున్నప్పటికీ, క్రూరమైన హత్యను అనుసరించే పేలవమైన దర్యాప్తు దృశ్యాలు ప్రేక్షకుల దృష్టిని తగ్గిస్తాయి. అంతేకాదు హాస్యభరితమైన సెటప్‌లో ఇంత తీవ్రమైన దర్యాప్తు జరిగే విధానం విచారణ యొక్క తీవ్రతను తగ్గిస్తుంది. అలాగే అనూహ్య పరిశోధనాత్మక దృశ్యాలు కూడా మీరు థ్రిల్లర్‌ను చూస్తున్నారనే భావనను కలిగించవు.

సాంకేతిక విభాగం:

పైన చెప్పినట్లుగా దర్శకుడు భవానీ శంకర్ యొక్క స్క్రీన్ ప్లే చాలా వరకు బాగున్నా చివరకు అది కాస్త నిరాశపరుస్తుంది. విజయ్ మోడీ హత్య తర్వాత సృష్టించబడిన ఖచ్చితమైన సెటప్‌ను విఫలమైందనే చెప్పాలి. ఇక రవి కుమార్ నీర్లా యొక్క సినిమాటోగ్రఫీ బాగుంది. విజయ్ మొదీ యొక్క అంతర్గత విపరీతతను బయటకు తీసుకురావడానికి అతను బలమైన ఎరుపు కాంతిని ఉపయోగిస్తాడు.

రాజేష్ నిద్వానా యొక్క సంగీత నేపధ్యం ఆకట్టుకోవడమే కాకుండా ఇది కథనానికి బాగా సహాయపడింది. చాలా కాలం తర్వాత తెలుగు చిత్రంలో బాగా కంపోజ్ చేసిన మరియు షాట్ చేసిన డిస్కో పాట చూడటం ఆనందంగా అనిపించింది. ఎడిటర్ బస్వా పైడిరెడ్డి తన ఎడిటింగ్‌కు మరింత పదును పెట్టి ఉంటే బాగుండేది. ముఖ్యంగ సెకాండాఫ్ దర్యాప్తు దృశ్యాలలో అది కొరవడింది. ఈ మీడియం బడ్జెట్ థ్రిల్లర్‌కు నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

మొత్తంగా చూసుకున్నట్టయితే “క్లైమాక్స్” అంటూ వచ్చిన ఈ చిత్రం తెలివైన క్లైమాక్స్ ట్విస్ట్ మరియు ప్రధాన నటుడు రాజేంద్రప్రసాద్ యొక్క విచిత్రమైన క్యారెక్టరైజేషన్ మినహా పెద్దగా పాజిటివ్ అంశాలేమి ఇందులో కనిపించలేదు. అయితే సినిమా అన్నాక క్లైమాక్స్ ఒక్కటే బాగుంటే సరిపోదు కదా..! ఏదేమైనా ఓవరాల్‌గా కామెడీతోపాటు థ్రిల్లింగ్ మూమెంట్స్, సస్పెన్స్ చిత్రాలను ఆదరించే వారికి మరియు రాజేంద్రప్రసాద్ అభిమానులకు ఈ సినిమా నచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక సాధారణ ప్రేక్షకులు మాత్రం సినిమాను ఓ సారి చూడొచ్చు.

123telugu.com Rating :  2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు