సమీక్ష : ‘ఎంత మంచివాడవురా’ – స్లోగా సాగే ఎమోషనల్ డ్రామా !

సమీక్ష : ‘ఎంత మంచివాడవురా’ – స్లోగా సాగే ఎమోషనల్ డ్రామా !

Published on Jan 16, 2020 3:02 AM IST
 Entha Manchivaadavuraa review

విడుదల తేదీ : జనవరి 15, 2020

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు :  కళ్యాణ్ రామ్, మెహ్రిన్ పిర్జా, తనికెళ్ళ భరణి, సుహాసిని, శరత్ బాబు, రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్ తదితరులు

దర్శకత్వం : వేగేశ్న సతీష్

నిర్మాత‌లు : ఉమేష్ గుప్తా, శుభాష్ గుప్తా

సంగీతం :  గోపి సుందర్

సినిమాటోగ్రఫర్ : రాజ్ తోట

ఎడిటర్:  తమ్మి రాజు

ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు. ఉమేశ్ గుప్తా, సుభాష్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయకిగా నటించింది. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..!

కథ :

బాలు (కల్యాణ్ రామ్) చిన్నతనంలో తల్లిదండ్రులను పోగొట్టుకుని.. చుట్టాలందరూ ఆదరించక ఒంటరి తనాన్ని బాధను అనుభవించి.. ఆ అనుభవంలో నుండి ఎదుటివారి బాధను ఎమోషన్ ను అర్ధం చేసుకోవడం నేర్చుకుంటాడు. అలా అతను పూర్తి పాజిటివ్ గా మారతాడు. అలాగే బంధంతో పాటు ఒక తోడు అవసరమైన వాళ్ళ కోసం ‘ఆల్ ఈజ్ వెల్ ఎమోషన్స్ సప్లేయర్’ అనే కంపెనీ పెట్టి, బంధం కోసం ఆప్యాయత కోసం ఎదురుచూస్తున్న వారికి వాళ్ళు కోరుకునే ఎమోషన్ ను అందిస్తాడు. ఈ క్రమంలో అతనికి వచ్చిన సమస్యలు ఏమిటి ? అతని జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి ? ఈ మధ్యలో నందిని (మెహ్రీన్)తో అతని లవ్ ఎమోషన్ ఎలా కొనసాగింది ? ఫైనల్ గా వారిద్దరికీ పెళ్లి అయిందా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

చిన్న చిన్న విషయాలకే కుంటుంబాలు అపోహలు అపార్థాలతో విడిపోతున్న ఈ జనరేషన్ లో.. దర్శకుడు వేగేశ్న సతీష్ ఈ సినిమాలో ఏ సంబందం లేని వారి మధ్య అద్భుతమైన ఎమోషన్ ఉంటే ఎంత బాగుంటుందో చాల చక్కగా చూపించాడు. మళ్లీ అంతలోనే ఆ పాత్రల మధ్యనే నవ్వులను కన్నీళ్లను మరియు అభిమానాలతో కూడుకున్న ఆత్మాభిమానాలను కూడా బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. మొత్తానికి సినిమాలో మనుషులకు ఉండే.. ఉండాల్సిన భావోద్వేగాలు బాగున్నాయి. నేటి తరం డబ్బు కోసం, అవసరాల కోసం ఏం పోగట్టుకుంటున్నారు అనే కోణాలని కూడా బాగా చూపించారు. ఇక దర్శకుడు రాసుకున్న కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా తనికెళ్ల భరణి ఎపిసోడ్ చాల బాగుంది.

నటన విషయానికి వస్తే.. త‌న‌కు కావాల్సిన రిలేష‌న్స్ తీసుకుంటూ, ఎదుటివాడికి కావాల్సిన ఎమోష‌న్స్ ఇచ్చే పాత్ర‌లో.. కళ్యాణ్ రామ్ తన ఎమోషనల్ యాక్టింగ్ తో బాగా నటించాడు. సినిమాలోని కోర్ ఎమోషన్ని ఆయన తన హావభావాలతోనే పలికించే ప్రయత్నం చేశారు. అలాగే హీరోయిన్ మెహ్రీన్ కూడా చాలా బాగా నటించింది. ఇక ఈ చిత్రానికి మరో బలం వెన్నెల కిషోర్ కామెడీ. సినిమాలో సెకెండ్ హాఫ్ లో ఎంటర్ అయి తన టైమింగ్ తో బాగా నవ్వించాడు. నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో రాజీవ్ కనకాల కూడా బాగా నటించారు.

మిగిలిన ప్రధాన పాత్రధారులు నరేష్, తనికెళ్ళ భరణి, సుహాసిని, శరత్ బాబు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్ :

కనుమరుగైపోతున్న మానవ సంబంధాలకు సంబంధించి దర్శకుడు తీసుకున్న కథాంశం బాగున్నప్పటికీ.. కథనం మాత్రం ఆసక్తికరంగా సాగదు. సెకెండ్ హాఫ్ లో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఇంట్రస్ట్ కలిగించలేని ట్రీట్మెంట్ తో స్లోగా సాగుతూ బోర్ కొడుతోంది. ముఖ్యంగా సెటప్, సీన్స్ మరియు స్క్రీన్ ప్లే అన్నీ పక్కా రొటీన్ గానే సాగుతాయి. ఇక హీరోహీరోయిన్ల మధ్య ఉన్న కొన్ని లవ్ సీన్స్ కూడా పూర్తిగా ఆకట్టుకోవు.

దీనికితోడు దర్శకుడు కమర్షియల్ అంశాలను దృష్టిలో పెట్టుకుని అనవసరమైన యాక్షన్ సన్నివేశాలను జోడించి సినిమాను ట్రాక్ తప్పించాడు.
పైగా కథకు బలం పెంచలేని లవ్ అండ్ ఫ్యామిలీ సీన్స్ ఎక్కువైపోయాయి. ఆ సీన్స్ కూడా బోర్ గా సాగడం.. అలాగే కొన్ని ఓవర్ డ్రామా సీన్స్ కూడా సినిమాకి బలహీనతగా నిలుస్తాయి. మొత్తానికి దర్శకుడు తాను అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేయలేకపోయారు. సెకెండ్ హాఫ్ లో చాల సీన్స్ ను ట్రిమ్ చేసి వుంటే సినిమాకి ప్లస్ అయ్యేది. మెయిన్ గా క్లైమాక్స్ సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్ గా నిలుస్తోంది.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. వేగేశ్న సతీష్ దర్శకుడిగా మంచి కథాంశంతో పర్వాలేదనిపించినా పూర్తిగా ఆకట్టుకోలేకపోయాడు. అలాగే ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే పై కూడా బాగా వర్క్ చెయ్యాల్సింది. చాల ల్యాగ్ సీన్స్ తగ్గేవి. సంగీత దర్శకుడు గోపిసుందర్ అందించిన పాటలు బాగున్నాయి. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో పర్వాలేదనిపిస్తోంది. అయితే సాంగ్స్ లో ముఖ్యంగా ఏమో ఏమో ఏ గుండెల్లో .. అనే సాంగ్ చాల బాగుంది. ఈ సాంగ్ సినిమా అస‌లు క‌థని చాల బాగా వివ‌రించింది.
ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రిమ్ చేసి ఉండి ఉంటే, సినిమాలో చాల వరకు బోర్ తగ్గేది. రాజ్ తోట సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని పెల్లెటూరు విజువల్స్ ను ఆయన చాలా సహజంగా అలాగే చాలా అందంగా చూపించారు. ఇక నిర్మాతలు ఉమేష్ గుప్తా, శుభాష్ గుప్తా పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

‘ఎంత మంచివాడవురా’ అంటూ సంబంధం లేని మనుషుల మధ్య కూడా ఫ్యామిలీ ఎమోషన్స్‌ ను గుర్తుచేసే కథాంశంతో సాగిన ఈ చిత్రం.. మంచి మెసేజ్ మరియు ఎమోషనల్ సీన్స్ తో పాటు కొన్ని కుటుంబ భావోద్వేగాలతో అలాగే వెన్నెల కిషోర్ తన కామెడీతో ఆకట్టుకునప్పటికీ.. ఈ సినిమా మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించడంలో విఫలం అయింది. కథనం ఆకట్టుకోకపోవడం, ఆసక్తిగా సాగని ప్రేమ సన్నివేశాలు మరియు బలమైన సంఘర్షణ లేని ఫ్యామిలీ సీన్స్ మరియు రొటీన్ డ్రామా.. వంటి అంశాలు ఈ సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. అయితే టచ్ చేసే కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే అంశాలు బాగుండటంతో ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. మరి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి.

 

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు