ఆడియో సమీక్ష : ఖైదీ నెం. 150 – ఫ్యాన్స్‌కు కిక్ ఎక్కించే ఆల్బమ్!

ఆడియో సమీక్ష : ఖైదీ నెం. 150 – ఫ్యాన్స్‌కు కిక్ ఎక్కించే ఆల్బమ్!

Published on Jan 4, 2017 10:15 PM IST

khaidi150

మెగా స్టార్ చిరంజీవి చాలాకాలం తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ‘ఖైదీ నెం. 150’. ఆయన కెరీర్‌కి ఇది 150వ సినిమా కూడా కావడంతో ఖైదీకి సంబంధించిన ప్రతి విషయం మొదట్నుంచీ విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తూ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆడియోపై కూడా అదే స్థాయిలో అంచనాలు కనిపించాయి. మరి ఆడియో ఆ అంచనాలను అందుకునేలానే ఉందా? చూద్దాం..

1. పాట : అమ్మడు2

గాయనీ గాయకులూ : దేవిశ్రీ ప్రసాద్, రైనా రెడ్డి
సాహిత్యం : దేవిశ్రీ ప్రసాద్

అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అంటూ దేవిశ్రీ స్టైల్లో సాగే పాట ఖైదీ నెం. 150 ఆల్బమ్‌లో మొదటిది. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన చిక్కినీ చమ్మెలీ తరహాలో ఈ పాట కనిపించిందని చెప్పుకోవచ్చు. అయితే దేవిశ్రీ తన స్టైల్లో హెవీ మాస్ బీట్స్ వాడి పాటకు తెలుగు స్టైల్ తీసుకురాగలిగాడు. దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా సాహిత్యం అందించడంతో పాటు, తానే రాసిన ఫన్నీ లిరిక్స్‌ను స్వయంగా దేవీయే పాడడం మరింత విశేషంగా చెప్పుకోవాలి. మాస్‌ను టార్గెట్ చేసిన ఈ పాట వినగానే ఎక్కేసేలా ఉందనే చెప్పొచ్చు.

 

52. పాట: యూ అండ్ మీ

గాయనీ గాయకులూ : హరిహరణ్, శ్రేయా ఘోశల్
సాహిత్యం : శ్రీమణి

‘యూ అండ్ మీ’ అంటూ సాగే ఈ పాటను ఈ ఆల్బమ్‌లో ఉన్న ఒకే ఒక్క రొమాంటిక్ నంబర్‌గా చెప్పుకోవాలి. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు పాత స్టైల్ ట్యూన్‌నే ఎంచుకొని, ఎక్కువగా సింగర్స్ డామినేషన్ ఉండేలా చూసుకున్నారు. హరిహరణ్, శ్రేయాల గానం ఈ పాటకు మంచి ఫీల్ తెచ్చిపెట్టింది. మొదటిసారి వింటే మామూలుగా అనిపించే ఈ పాట వినగా వినగా మాత్రం బాగానే ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు.

 

3. పాట: రత్తాలు4

గాయనీ గాయకులూ : నకాశ్ అజీజ్, జాస్మిన్
సాహిత్యం : దేవిశ్రీ ప్రసాద్

ఆల్బమ్‌లో వచ్చే మరో మాస్ నంబరే ఈ రత్తాలు. నిస్సందేహంగా ఈ పాటను ఆల్బమ్‌లో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వినగానే ఎక్కేసేలా ఉన్న ట్యూన్, అందుకు తగ్గ బీట్స్ అన్నీ పాటకు మంచి ఈజ్ తెచ్చిపెట్టాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సాహిత్యం కూడా చాలా బాగుంది. మాస్ ప్రియులకు ఈ పాట పండగే అని చెప్పుకోవచ్చు. చిరు ట్రేడ్ మార్క్ డ్యాన్స్‌లతో కలిపిచూస్తే ఈ పాటకు తిరుగుండదనే చెప్పొచ్చు.

 

14. పాట: సుందరి

గాయనీ గాయకులూ : జస్‌ప్రీత్
సాహిత్యం : శ్రీమణి

సుందరి అంటూ సాగే ఈ పాటను ఆల్బమ్‌లో మంచి ఫన్ పాటగా చెప్పుకోవచ్చు. దేవిశ్రీ ఇలా ట్యూన్ ఇచ్చినప్పుడల్లా మంచి బీట్స్ ఉండేలా చూసుకుంటూ పాటకు మంచి ఊపు తీసుకొస్తారు. ఈ పాట కూడా అదే స్టైల్లో సూపర్ ఫన్ నెంబర్‌గా నిలిచింది. శ్రీమణి అందించిన లిరిక్స్, జస్‌ప్రీత్ సింగింగ్ ఈ పాటకు మంచి అందాన్నిచ్చాయి. ముఖ్యంగా జస్‌ప్రీత్ డిఫరెంట్ వాయిస్ పాటకు కొత్త ఫీల్ తెచ్చింది. వినగానే డ్యాన్స్ వేయాలనిపించేలా ఉన్న ఈ పాటను చిరు, కాజల్‌ల కాంబినేషన్‌లో చూస్తే మరో స్థాయిలో ఉంటుందని ఆశించొచ్చు.

 

5. పాట: నీరు నీరు3

గాయనీ గాయకులూ :
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి

‘నీరు నీరు’ అంటూ సాగే ఈ పాటను మంచి ఇంటెన్సిటీ ఉన్న థీమ్ సాంగ్‌గా చెప్పుకోవచ్చు. సినిమా అసలు కథ రైతుల కష్టాలను ప్రస్తావించేది కావడంతో, ఆ నేపథ్యంలో రూపొందిన ఈ పాట కథకు న్యాయం చేసేలా ఉంది. రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం కూడా సూటిగా, బలంగా తాకేలా ఉండి ఆకట్టుకుంది. సీరియస్ టోన్‌లో పాట సాగేలా దేవిశ్రీ తీసుకున్న జాగ్రత్తలు కూడా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. శంకర్ మహదేవన్ గానం పాట స్థాయిని మరింత పెంచింది.

తీర్పు :

పెద్ద హీరోల సినిమా ఆడియో విడుదలంటే హంగామా ఉంటుంది. అలాంటిది చిరంజీవి హీరోగా నటించిన 150వ సినిమా ఆడియో ఎలా విడుదల కావాలి? అయితే ఆర్భాటాలేవీ లేకుండా నేరుగా మార్కెట్‌లోకి ఒక్కో పాటను విడుదల చేస్తూ ‘ఖైదీ నెం 150’ టీమ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ నిర్ణయం ఆడియోకు బాగా కలిసివచ్చిందనే చెప్పాలి. ఒక్కో పాటకు సరైన సమయం దొరకడంతో అన్ని పాటలూ చాట్‌బస్టర్స్ అయిపోయాయి. ‘అమ్మడు’, ‘రత్తాలు’, ‘సుందరి’ వినగానే ఎక్కేసే పాటలుగా చెప్పొచ్చు. దేవిశ్రీ ప్రసాద్ కొత్తదనానికి పోకుండా ఓల్డ్ స్టైల్లోనే పాటలిచ్చి సేఫ్ గేమ్ ఆడేశాడు. కాగా ఆ సేఫ్ గేమ్‌లోనే అభిమానులకు కిక్ ఎక్కించే పాటలు రావడంతో ‘ఖైదీ నెం. 150’ ఆల్బమ్ టార్గెట్‍ను అందుకుంది.

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు