సమీక్ష : ఉత్తర – అందమైన ప్రేమకథకు..అర్థం లేని ముగింపు

విడుదల తేదీ : జనవరి 03, 2020

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు :  శ్రీరామ్, కరోణ్య కట్రిన్, అజయ్ ఘోష్, టిల్లు వేణు,అధిరే అభి తదితరులు

దర్శకత్వం : తిరుపతి ఎస్ ఆర్

నిర్మాత‌లు : శ్రీపతి గంగదాస్, తిరుపతి ఎస్ ఆర్

సంగీతం :  సురేష్ బొబ్బిలి

సినిమాటోగ్రఫర్ : క్రాంతి కుమార్ కె

ఎడిటర్:  బి. నాగేశ్వర రెడ్డి

శ్రీరామ్, కరోణ్య కట్రిన్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు తిరుపతి ఎస్ ఆర్ తెరకెక్కించిన చిత్రం ఉత్తర. నేడు ఈ మూవీ విడుదల కావడం జరిగింది. ఉత్తర మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం..

కథ:

తన గ్రామంలో మిత్రులతో అల్లరి చిల్లరిగా తిరిగే గ్రాడ్యుయేట్ కుర్రాడు అశోక్ (శ్రీరామ్) అదే ఊరికి చెందిన స్వాతి(కరోణ్య కట్రిన్) ప్రేమలో పడతాడు. స్వాతి అశోక్ ల ప్రేమకు వాళ్ళ నాన్న అడ్డుపడతారు. ఈ సమయంలో స్వాతి ఎలాగైనా డబ్బు సంపాదించి వాళ్ళ నాన్నను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అశోక్ ని ఇబ్బంది పెడుతుంది. అందుకోసం అశోక్ ఎప్పుడో చనిపోయిన ఉత్తర అనే ఒక అమ్మాయికి చెందిన పాడుబడిన ఇంటిలో ఉన్న గుప్త నిధులు తన మిత్రుల సహాయంతో చేజిక్కించుకోవాలని అనుకుంటాడు. మరి అశోక్ కి ఉత్తర ఇంటిలో ఉన్న గుప్త నిధులు దొరికాయా? అసలు ఈ ఉత్తర ఎవరు? చివరికి అశోక్ మరియు స్వాతిల ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేది మిగతా కథ..

 

ప్లస్ పాయింట్స్:

ఉత్తర మూవీ మొదటి సగం శ్రీరామ్, కరోణ్య ల మద్య నడిచే ప్రేమకథ, తెలంగాణా మాండలికంలో మిత్రుల మధ్య సరదా సంభాషలనలో ఆహ్లదంగా సాగుతుంది. పల్లె వాతావరణం, సహజత్వానికి దగ్గరగా పాత్రల తీరు నచ్చుతుంది.

హీరోగా శ్రీరామ్ నటన ఆకట్టుకుంటుంది. చాలా సన్నివేశాలలో అతను తన పాత్రకు న్యాయం చేశారు. ఐతే ఇంకొంచెం పరిపక్వత అవసరం అనిపిస్తుంది.
ఐతే హీరోయిన్ కరోణ్య నటన కట్టిపడేస్తుంది. పొగరు అమాయకత్వం కలిగిన పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయింది. ఆమె ఎక్స్ప్రెషన్స్ సినిమాలో హైలెట్ అని చెప్పాలి.

దొంగగా నటించిన టిల్లు వేణు, కానిస్టేబుల్ పాత్రలో జబర్ధస్త్ అదిరే అభి నటన బాగుంది. ముఖ్యంగా వేణు నవ్వులు పండించారు. శ్రీరామ్ మిత్రులుగా నటించిన నలుగురు నటులు పల్లెటూరి దోస్తులుగా చక్కగా చేశారు. ఈ మధ్య వైవిధ్యమైన పాత్రలు దక్కించుకుంటున్న అజయ్ ఘోష్ ఎప్పటిలాగే తన మార్కు ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకున్నారు.

 

మైనస్ పాయింట్స్:

మొదటి సగం ఒక ఆహ్లదకరమైన పల్లెటూరి ప్రేమ కథతో ముగించిన దర్శకుడు రెండవ సగం కంప్లీట్ గా అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్లిపోయారు. ప్రేమకథకు హారర్ స్టోరీని అతికించబోయి తడబడ్డాడు.

అసలు ఈ సినిమాకు ఉత్తర అనే టైటిల్ ఎందుకు పెట్టారో కూడా తెలియని పరిస్థితి. ఆ ఉత్తర అనే అమ్మాయి నేపథ్యం ఏమిటో, ఆ పాత్ర ఈ సినిమాకు ఎందుకు అవసరమో ప్రేక్షకుడికి అర్థం కాదు. క్లైమాక్స్ లో వచ్చే పది నిమిషాల ఉత్తర పాత్ర కోసం టైటిల్ పెట్టి మరి ఈ చిత్రం నడిపించారు.

ప్రేమ కథగా మొదలైన ఉత్తర మూవీ సెకండ్ హాఫ్ లో హారర్ గా మొదలై చివరకు ఆడవారిపై అఘాయిత్యాలు అనే సోషల్ మెసేజ్ తో ముగిస్తుంది.

తక్కువ బడ్జెట్ మూవీ కావడంతో హారర్ సన్నివేశాలు ఏమాత్రం ఆహ్లదం కలిగించవు. ఇక క్లైమాక్స్ ముగించిన విధానం కూడా అంత ఆసక్తికరంగా లేదు.

 

సాంకేతిక విభాగం:

పల్లెటూరి వాతావరణం, పరిసరాలు చక్కగా తెరపై ఆవిష్కరించిన సినిమాటోగ్రాఫర్ పని తీరు నచ్చుతుంది. ఎడిటింగ్ పర్వాలేదు. సురేష్ బొబ్బిలి ఒకటి రెండు పాటలు మినహా అంతగా ప్రభావం చూపలేదు. ఆయన అందించిన బీజీఎమ్ కూడా అంతగా మెప్పించలేకపోయింది.

ఇక దర్శకుడు తిరుపతి ఎస్ ఆర్ గురించి చెప్పాలంటే ఆయన సినిమాను చక్కగా మొదలుపెట్టారు. తనకు ఇచ్చిన లిమిటెడ్ బడ్జెట్ తో పల్లె పరిసరాలను వాడుకుంటూ ఆకట్టుకొనే ప్రేమ కథ విరామం వరకు నడిపించారు. సెకండ్ హాఫ్ నుండి ఆయన సినిమాను కథను పూర్తిగా పక్కదారి పట్టించారు. అందమైన ప్రేమ కథకు అవసరం లేని హారర్ మెస్సేజ్ లు జోడించి సినిమా కిచిడి చేసిపారేశారు.

 

తీర్పు:

ఓ పల్లెటూరి ప్రేమకథకు నప్పని హారర్ మరియు సోషల్ మెసేజ్ ను జోడించి దానిని సరిగా డీల్ చేయలేక దర్శకుడు తడబడ్డాడు. ఐతే మొదటి సగంలో ప్రధానంగా నడిచే పల్లెటూరి ప్రేమ కథ, స్నేహితుల సరదా సంభాషణలు, అదిరే అభి, టిల్లు వేణు కామెడీ అలరించే అంశాలు. ప్రాధాన్యం లేని ఒక పాత్రను పేరును టైటిల్ గా పెట్టి సెకండ్ హాఫ్ అనవసరమైన హంగులు జోడించి సినిమాను దెబ్బతీశారు. అందుకే ఉత్తర ఓ మంచి సినిమాగా మొదలై నిరాశాజనకంగా ముగిసిందని చెప్పవచ్చు.

 

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Version

సంబంధిత సమాచారం :

More